Header Ads Widget

Congress Guarantees: కాంగ్రెస్‌ 'ఆరు గ్యారంటీ'లపై అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

 Congress Guarantees: కాంగ్రెస్‌ 'ఆరు గ్యారంటీ'లపై అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం



కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరు నూరైనా వాటిని అమలు చేస్తామంటోంది అధికార కాంగ్రెస్‌. అధికార పార్టీ ఇచ్చింది ఆరు కాదు..412 హామీలు అంటోంది విపక్ష బీఆర్‌ఎస్‌.


ఎంతవరకు వాటిని అమలు చేస్తారో చూద్దాం అంటోంది. ఇక 6 గ్యారంటీలను మాట తప్పకుండా వంద రోజుల్లో అమలు చేయాలంటోంది మరో ప్రతిపక్షం బీజేపీ. ఆరు – వారు…ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు రేపుతోంది.


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారం లోకి తెచ్చిన ఆరు గ్యారంటీల మీద అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వంద రోజుల్లో 6 గ్యారంటీలను కాంగ్రెస్‌ అమలు చేసి తీరాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. సాకులు చూపి తప్పించుకోవడానికి వీల్లేదని విపక్షాలు అంటే…హామీలు నెరవేర్చేదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు అధికార పక్ష నేతలు. కాంగ్రెస్‌ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని, 412 హామీలంటున్నారు బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి. అవి ఎంతవరకు అమలు చేస్తారో చూద్దామన్నారు.


బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అందరికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల లోపల కాంగ్రెస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. సాకులు చెప్పి దాటవేయకూడదన్నారు.


విపక్షాలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ప్రజా పాలన కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ తీసుకువచ్చారని వివరించారు. అర్హులను గుర్తించాక కొత్త ఏడాదిలో హామీలను అమలు చేస్తామన్నారు ఆమె. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలపై అధికార విపక్షాలు కత్తులు నూరుకుంటున్నాయి.

Post a Comment

0 Comments